క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా: చంద్రబాబు

క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా: చంద్రబాబు


అమరావతి: అమరావతి ప్రాజెక్టు తప్పు అని ప్రజలంటే.. క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిపై టీడీపీ రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి చంద్రబాబు అధ్యక్షత వహించారు. సమావేశానికి సీపీఐ నేతలు రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, జనసేన నుంచి పోతిన మహేష్‌, ఆర్‌ఎస్పీ నుంచి జానకి రాములు హాజరైనారు. వీరితో పాటుగా రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి ఎమ్మెల్యే బాలకృష్ణ, ఫార్వర్డ్‌ బ్లాక్‌, లోక్‌సత్తా, ఆమ్‌ ఆద్మీ, ప్రజా సంఘాల నేతలు హాజరైనారు. సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ అమరావతిలో ఏం జరుగుతోందో తెలిపేందుకే ఈ సమావేశం ఉద్దేశమని వివరించారు. ప్రజా రాజధాని అమరావతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అమరావతి భావితరాల భవిష్యత్‌ అని చెప్పుకొచ్చారు. రాష్ట్రం, సమాజం శాశ్వతం, వ్యక్తులు శాశ్వతం కాదని వ్యాఖ్యానించారు. అమరావతిపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, ప్రజాచైతన్యం వల్లే అమరావతి నిలబడుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.